Matthew 13

పరలోక రాజ్య మర్మాలు. 1. విత్తనాలు (మార్కు 4:1-20. లూకా 8:4-15)

1ఆ రోజు యేసు ఇంట్లో నుండి వెళ్ళి సముద్రం ఒడ్డున కూర్చున్నాడు. 2ప్రజలు పెద్ద గుంపులుగా తన చుట్టూ చేరినపుడు ఆయన పడవ ఎక్కి కూర్చున్నాడు. ప్రజలంతా ఒడ్డున నిలుచున్నారు.

3ఆయన వారిని చూసి చాలా సంగతులు ఉపమాన రీతిగా చెప్పాడు. ఆయన వారితో, “విత్తనాలు చల్లేవాడు చల్లడానికి బయలుదేరాడు.

4అతడు విత్తనాలు చల్లుతూ ఉంటే కొన్ని విత్తనాలు దారి పక్కన పడ్డాయి. పక్షులు వచ్చి వాటిని మింగివేశాయి. 5కొన్ని విత్తనాలు మట్టి ఎక్కువగా లేని రాతి నేలమీద పడ్డాయి. అక్కడ మట్టి లోతుగా లేకపోవడం చేత అవి వెంటనే మొలకెత్తాయిగానీ, 6ఎండ వచ్చినప్పుడు అవి మాడిపోయి వేరులు లేకపోవడంతో ఎండిపోయాయి.

7కొన్ని విత్తనాలు ముళ్ళ కంపల్లో పడ్డాయి. ముళ్ళ కంపలు ఎదిగి వాటిని అణిచి వేశాయి. 8మరికొన్ని విత్తనాలు మంచి నేలపై పడి పంటకు వచ్చాయి. వాటిలో కొన్ని వంద రెట్లు, కొన్ని అరవై రెట్లు, కొన్ని ముప్ఫై రెట్లు ఫలించాయి. 9చెవులున్నవాడు విను గాక!” అన్నాడు.

10తరువాత శిష్యులు వచ్చి, “నీవు ఉపమానాలతో ఎందుకు వారితో మాట్లాడుతున్నావు?” అని అడిగారు. ఆయన వారికి జవాబిస్తూ ఇలా అన్నాడు, 11“పరలోక రాజ్య మర్మాలు గ్రహించే భాగ్యం దేవుడు మీకు అనుగ్రహించాడు, వారికి అనుగ్రహించలేదు. 12కలిగిన వాడికి ఇంకా ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. అతనికి సమృద్ధిగా ఉంటుంది. లేని వాని నుంచి అతని దగ్గర ఉన్న కొంచెం కూడా తీసివేయడం జరుగుతుంది.

13ఇందుకోసమే నేను వారికి ఉపమానాలతో బోధిస్తున్నాను. వారు చూస్తున్నారు గానీ నిజానికి చూడరు. వింటున్నారు గానీ నిజానికి వినరు, అర్థం చేసుకోరు. 14యెషయా చెప్పిన ప్రవచనం వీరి విషయంలో నెరవేరింది.

‘మీరు వినడానికి వింటారు గాని గ్రహింపనే గ్రహింపరు.
చూడడానికి చూస్తారు గాని ఏ మాత్రం తెలుసుకోరు.

15ఈ ప్రజల హృదయం బండబారి పోయింది.

వారికి చెముడు వచ్చినట్టుగా ఉంది.
వారి కళ్ళు మూసుకుపోయాయి.
వారు కళ్ళారా చూసి, చెవులారా విని, హృదయంతో గ్రహించి,
మనసు తిప్పుకుని నా వలన బాగుపడే వీలు లేకుండా అయిపోయింది.’

16“అయితే మీ కళ్ళు చూస్తున్నాయి కాబట్టి అవి ధన్యమయ్యాయి. మీ చెవులు వింటున్నాయి, కాబట్టి అవి ధన్యమయ్యాయి. 17చాలామంది ప్రవక్తలూ నీతిమంతులూ మీరు చూస్తున్నవాటిని చూడాలని ఆశించారు గానీ చూడలేక పోయారు. మీరు వింటున్న వాటిని వినాలనుకున్నారు గానీ వినలేకపోయారని మీతో కచ్చితంగా చెబుతున్నాను.

18“విత్తనాలు చల్లే వాడి గురించిన ఉపమానం అర్థం వినండి. 19ఎవరైనా రాజ్యం గురించిన వాక్కు విని కూడా గ్రహించకపోతే దుష్టుడు వచ్చి అతని హృదయంలో పడిన విత్తనాలను ఎత్తుకు పోతాడు. దారిపక్కన చల్లిన విత్తనాలు వీరే.

20రాతినేలను చల్లిన విత్తనాలు ఎవరంటే, వాక్యం విని వెంటనే సంతోషంతో దాన్ని అంగీకరించేవారు. 21అయితే అతనిలో వేరు లేకపోవడంతో అతడు కొద్ది కాలమే నిలిచి ఉంటాడు. వాక్యం కారణంగా కష్టాలు గానీ హింసలు గానీ కలగగానే తొట్రుపడిపోతాడు.

22ముళ్ళ మొక్కల్లో చల్లిన విత్తనాలు ఎవరంటే, వాక్యం వింటారు గానీ ఈ లోక చింతలూ, సంపదలోని మోసమూ ఆ వాక్యాన్ని అణచివేస్తాయి. కాబట్టి వారు ఫలించకుండా పోతారు. 23మంచి నేలపై చల్లిన విత్తనాలు ఎవరంటే, వాక్కు విని దాన్ని అర్థం చేసుకునేవాడు. అలాటి వారు నిజంగా ఫలించి వృద్ధి పొందుతారు. కొందరు వంద రెట్లు, కొందరు అరవై రెట్లు, మరికొందరు ముప్ఫై రెట్లు ఫలిస్తారు.”

రెండవ మర్మం. గోదుమ చేలో కలుపు మొక్కలు (వ. 24-30. 36-43)

24ఆయన మరొక ఉపమానం వారితో చెప్పాడు, “పరలోక రాజ్యం తన పొలంలో మంచి విత్తనాలు చల్లించిన రైతులా ఉంది. 25మనుషులు నిద్రపోతూ ఉంటే అతని శత్రువు వచ్చి గోదుమల మధ్య కలుపు మొక్కల విత్తనాలు చల్లి పోయాడు.

26మొక్కలు పెరిగి కంకులు వేసినప్పుడు ఆ కలుపు మొక్కలు కూడా కనిపించాయి.

27అప్పుడు ఆ రైతు పనివారు అతని దగ్గరికి వచ్చి ‘అయ్యా, నువ్వు నీ పొలంలో మంచి విత్తనం చల్లించావు గదా, అందులో కలుపు మొక్కలు ఎలా వచ్చాయి?’ అని అడిగారు. 28‘ఇది పగవాడు చేసిన పని’ అని అతడు వారితో అన్నాడు. ఆ పనివారు ‘మేము వెళ్ళి ఆ కలుపు మొక్కల్ని పీకేయమంటారా?’ అని అతన్ని అడిగారు.

29అందుకు ఆ యజమాని, ‘వద్దు. కలుపు మొక్కల్ని పీకితే వాటితోబాటు గోదుమ మొక్కలనుకూడా పెళ్లగిస్తారేమో. 30కోతకాలం వరకూ రెంటినీ కలిసి పెరగనివ్వండి. కోతకాలంలో మొదట కలుపు మొక్కల్ని పోగు చేసి కాల్చివేయడానికి కట్టలు కట్టండి. గోదుమలను నా గిడ్డంగిలో చేర్చండి, అని కోత కోసే వారికి చెబుతాను’ అన్నాడు.”

మూడవ మర్మం. ఆవ గింజ (మార్కు 4:30-32)

31ఆయన మరొక ఉపమానం వారితో చెప్పాడు. “పరలోకరాజ్యం ఇలా ఉంది. ఒకడు తన పొలంలో ఒక ఆవ విత్తనం నాటాడు. 32అది విత్తనాలన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటినీ మించిన పెద్ద చెట్టు అవుతుంది. పక్షులు వచ్చి దాని కొమ్మల్లో గూళ్ళు కట్టుకుంటాయి.”

నాలుగవ మర్మం. పొంగజేసే పదార్థం (లూకా 13:20,21)

33ఆయన ఇంకొక ఉపమానం వారితో చెప్పాడు, “పరలోక రాజ్యం ఒక స్త్రీ మూడు మానికల పిండిలో వేసి కలిపి అది అంతా పులిసేలా చేసిన పులిపిండిలాగా ఉంది.”


34
This verse is empty because in this translation its contents have been moved to form part of verse Mat 13:35.
In this translation, this verse contains text which in some other translations appears in verses Mat 13:34-Mat 13:35.
35“నేను నా నోరు తెరచి ఉపమానాలతో బోధిస్తాను.

లోకం సృష్టి మొదలుకొని రహస్యంగా ఉండిపోయిన విషయాలు చెబుతాను.”

అని ప్రవక్త చెప్పిన మాట నెరవేరేలా యేసు ఈ సంగతులన్నీ ప్రజలకు ఉపమానాలతో బోధించాడు. ఉపమానం లేకుండా ఆయన వారికి దేన్నీ బోధించలేదు.

గోదుమ, కలుపు మొక్కల ఉపమానం వివరణ

36అప్పుడాయన ప్రజలను పంపివేసి, ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఆయన శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి, “పొలంలోని కలుపు మొక్కల్ని గురించిన ఉపమానం అర్థం మాకు చెప్పు” అని అడిగారు. 37అందుకాయన ఇలా అన్నాడు, “మంచి విత్తనం చల్లేది మనుష్య కుమారుడు. 38పొలం ఈ లోకం. మంచి విత్తనాలు పరలోక రాజ్యానికి సంబంధించిన వారు. కలుపు మొక్కలు దుష్టుని సంబంధులు. 39వాటిని చల్లే ఆ శత్రువు సాతాను. కోతకాలం లోకాంతం. కోత కోసే వారు దేవదూతలు.

40కలుపు మొక్కలను పోగుచేసి మంటల్లో కాల్చినట్టే ఈ లోకాంతంలో జరుగుతుంది. 41మనుష్యకుమారుడు తన దూతలను పంపుతాడు. వారాయన రాజ్యంలో నుండి పాపానికి కారణమయ్యే ప్రతి దానినీ దుర్మార్గం చేసే వారందరినీ సమకూర్చి అగ్నిగుండంలో పడవేస్తారు. 42అక్కడ ఏడుపూ పళ్ళు కొరుక్కోవడమూ ఉంటాయి. 43అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని లాగా ప్రకాశిస్తారు. వినగలిగే చెవులున్నవాడు విను గాక.

ఐదవ మర్మం. భూమిలో నిక్షిప్త నిధి

44“పరలోకరాజ్యం పొలంలో దాచిన నిధి లాగా ఉంది. ఒక మనిషి దాన్ని చూసి దాచి పెట్టి, అది దొరికిన సంతోషంతో వెళ్ళి, తనకున్నదంతా అమ్మి ఆ పొలం కొంటాడు.

ఆరవ మర్మం. ఆణిముత్యం

45“పరలోకరాజ్యం మంచి ముత్యాలను కొనడానికి వెతుకుతున్న ఒక వ్యాపారస్తుడి లాగా ఉంది. 46అతడు చాలా విలువైన ఒక ముత్యం కనబడగానే పోయి తనకు ఉన్నదంతా అమ్మేసి దాన్ని కొనుక్కుంటాడు.

ఏడవ మర్మం. లాగే వల

47“పరలోకరాజ్యం సముద్రంలో వేసే వలను పోలి ఉంది. అందులో రకరకాల చేపలు పడతాయి. 48అది నిండినప్పుడు తీరానికి లాగి, కూర్చుని మంచి వాటిని గంపల్లో వేసుకుని పనికి రాని వాటిని విసిరి పారేస్తారు.

49అలాగే ఈ లోకాంతంలో జరుగుతుంది. దేవ దూతలు వచ్చి నీతిమంతుల్లో నుండి దుష్టులను వేరు చేసి, 50వారిని అగ్ని గుండంలో పడవేస్తారు. అక్కడ ఏడుపూ పళ్ళు కొరుక్కోవడం ఉంటాయి.

51వీటినన్నిటిని మీరు గ్రహించారా?” అని ఆయన వారిని అడిగినప్పుడు వారు జవాబిస్తూ, “గ్రహించాము” అన్నారు. 52ఆయన, “అందువలన దేవుని రాజ్యాన్ని గురించి ఉపదేశం పొందిన ప్రతి ధర్మశాస్త్ర పండితుడూ తన ఖజానాలో నుండి కొత్త వాటినీ పాత వాటినీ బయటికి తెచ్చే ఇంటి యజమానిలాగా ఉన్నాడు” అని వారితో చెప్పాడు.

యేసు నజరేతు తిరిగి రాక. మళ్లీ తిరస్కారం (మార్కు 6:1-6. లూకా 4:16-32)

53
This verse is empty because in this translation its contents have been moved to form part of verse Mat 13:54.
In this translation, this verse contains text which in some other translations appears in verses Mat 13:53-Mat 13:54.
54యేసు ఈ ఉపమానాలు చెప్పి ఊరుకున్న తరువాత, ఆయన అక్కడ నుండి వెళ్ళి తన సొంత ఊరు వచ్చి, సమాజ మందిరాల్లో వారికి బోధిస్తూ ఉన్నాడు. వారు ఆశ్చర్యపడి, “ఈ జ్ఞానం, ఈ అద్భుతాలు ఇతనికి ఎక్కడ నుంచి వచ్చాయి? 55ఇతడు వడ్రంగి కొడుకు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యూదా అనే వారు ఇతని సోదరులు కారా? 56ఇతని సోదరీలంతా మనతోనే ఉన్నారు కదా! ఇతనికి ఇవన్నీ ఎక్కడ నుండి వచ్చాయి?” అని చెప్పుకుని ఆయన విషయంలో అభ్యంతరపడ్డారు.

57అయితే యేసు, “ఒక ప్రవక్త తన స్వదేశంలో, తన సొంత ఇంట్లో తప్ప మిగతా అన్ని చోట్లా ఘనత పొందుతాడు” అని వారితో చెప్పాడు. వారి అవిశ్వాసాన్ని బట్టి ఆయన అక్కడ ఎక్కువ అద్భుతాలు చేయలేదు.

58

Copyright information for TelULB